ఆగస్టు 15 న 5జీ సేవలను లాంచ్ చేయనున్న Reliance Jio?

హైలైట్స్:

  • భారత్ లో 5జీ లాంచ్ పై హింట్ ఇచ్చిన రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ
  • ప్యాన్-ఇండియా 5జీ రోలౌట్ తో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ని సెలబ్రేట్ చేయనున్నట్లు చెప్పిన అంబానీ
  • ఇక ఇటీవలె ముగిసిన స్పెక్ట్రమ్ వేలంలో టాప్ బిడ్డర్ గా నిలిచిన జియో, రెండవ, మూడవ స్థానాల్లో ఉన్న ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా

5జీ స్పెక్ట్రమ్ వేలాన్ని విజయవంతంగా ముగించుకున్న రిలయన్స్ జియో మరో అడుగు ముందుకేసి, భారత్ లో 5జీ లాంచ్ కి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇటీవలె ముగిసిన 5జీ వేలంలో టాప్ బిడ్డర్ గా జియో నిలిచింది. అనుకున్న దానికంటే ముందుగానే 5జీ సేవలు భారత్ లో మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అమ్ముడైన మొత్తం ఎయిర్‌వేవ్స్ లో సగం తరంగాలకు రూ.80,000 కోట్లు ఖర్చు చేయడంపై మాట్లాడిన రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ, “ప్యాన్ ఇండియా 5జీ రోలౌట్ తో ఆజాదీ అమ‌ృత్ మహోత్సవ్ సెలబ్రేట్ చేయబోతున్నాం,” అన్నారు. ఇది అనుకున్న సమయానికి జరిగితే, జియో 5జీ సేవలు భారత్ లో ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

భారత్ లో అక్టోబర్ నుంచి అందుబాటులోకి 5G సేవలు – ప్రభుత్వం

కేంద్ర టెలీకామ్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ చెబుతున్న దాన్ని బట్టి, ఆగస్టు 10 కల్లా ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయింపులను పూర్తి చేయనుందని, ఇక అక్టోబర్ మాసం నుంచి దేశంలో 5జీ సేవలు మొదలవ్వనున్నాయని తెలుస్తోంది.

చెప్పినట్లుగానే, తక్కువ సమయంలోనే జియో తన 5జీ సేవలను ప్రారంభిస్తే, భారత్ లో మొదటగా 5జీ సేవలను లాంచ్ చేసిన తొలి నెట్వర్క్ గా జియో పేరు నిలిచిపోతుంది. స్పెక్ట్రమ్ ఆక్విసిషన్ గురించి మాట్లాడిన ఆకాశ్ అంబానీ, “తక్కువ సమయంలోనే దేశ వ్యాప్తంగా 5జీ సేవలు అందించేందుకు జియో సిద్ధంగా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఫైబర్ లభ్యత, లెగసీ ఇన్ఫాస్ట్రక్చర్ రహిత ఆల్-ఐపీ నెట్వర్క్, ఇండీజినస్ 5జీ స్టాక్, టెక్నాలజీ ఎకోసిస్టమ్ లో బలమైన గ్లోబల్ భాగస్వామ్యం వంటివి ఉండటం చేత ఇంత త్వరగా 5జీ సేవలను మొదలు పెట్టడం సాధ్యమవుతుంది,” అని ఆకాశ్ అంబానీ అన్నారు.

5G స్పెక్ట్రమ్ వేలం

టెలీ కమ్యూనికేషన్స్ విభాగం నిర్వహించిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో హయ్యస్ట్ బిడ్డర్ గా నిలిచింది. భారతీ ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉండగా, వొడాఫోన్ ఐడియా మూడవ హయ్యస్ట్ బిడ్డర్ గా నిలిచింది. 700MHz, 800MHz, 1800MHz, 3300MHz, 26GHz బ్యాండ్స్ లో రూ.88,078 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ ను జియో కొనుగోలు చేసింది. దేశ వ్యాప్తంగా 5జీ సేవలను అందించేందుకు సరిపడా స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసినట్లు జియో తెలిపింది. 700 మెగాహెర్ట్జ్ తరంగాలను జియో కంపెనీ సొంతం చేసుకుంది. దీంతో తన పోటీదార్ల కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఇది 5జీ సేవల విషయంలో జియో కి కలిసి వచ్చే విషయం.

మరోవైపు భారతీ ఎయిర్టెల్ రూ.19,867 కోట్ల విలువైన మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసింది. వొడాఫోన్ ఐడియా రూ.2,668 కోట్ల విలువైన మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసింది. ఇక కొత్త ప్లేయర్ అయిన, అదానీ డేటా నెట్వర్క్స్ లిమిటెడ్ సంస్థ 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్స్ లో పెట్టుబడులు పెట్టింది. తన వ్యాపార స్థలాలైన విమానాశ్రయాలు, పోర్ట్స్, పవర్ జనరేషన్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో కొనుగోలు చేసిన 5జీ స్పెక్ట్రమ్ ని వినియోగించనుంది. ప్రస్తుతానికి టెలీకమ్ సెక్టర్ లోకి ప్రవేశించే ఆలోచన అదానీ గ్రూప్ కి లేదు.