భారత్ లో లాంచ్ అయిన కొత్త Nokia ఫోన్.. 27 రోజుల బ్యాటరీ బ్యాకప్

హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన Nokia 8210 4G ఫీచర్ ఫోన్
  • 27 రోజుల బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత
  • 1999 లో నోకియా నుంచి వచ్చిన నోకియా 8210 మోడల్ కి ఇది లేటెస్ట్ వర్షన్

నోకియా కంపెనీ భారత్ లో Nokia 8210 4G ఫీచర్ ఫోన్ ని లాంచ్ చేసింది. 27 రోజుల బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. దృఢమైన బాడీ, ఎక్కువ రోజులు నడిచే బ్యాటరీ తో వచ్చిన ఈ ఫీచర్ ఫోన్ 1999 లో నోకియా నుంచి వచ్చిన నోకియా 8210 మోడల్ కి ఇది లేటెస్ట్ వర్షన్. ఇప్పటి వరకు జనాలు ఈ ఫోన్ ని మరచిపోలేదు. ఆ ఓల్డ్ మోడల్ ని గుర్తు తెస్తూ, లేటెస్ట్ గా ఈ ఫోన్ ని లాంచ్ చేసారు. పాత మోడల్ లో 2జీ నెట్వర్క్ మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, లేటెస్ట్ మోడల్ లో 4జీ కనెక్టివిటీ ఉంది. ఇక ఫోన్ యొక్క ఇతర ఫీచర్లను గురించి చూస్తే, ఫోన్ లో యూనిసాక్ టీ107 చిప్సెట్ ను అమర్చారు. 48ఎంబి ర్యామ్ ఉంటుంది. దీంతో పాటు, ఫోన్లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉంది.

Nokia 8210 4G ధర

అమెజాన్ ఇండియా తో కలిసి నోకియా కంపెనీ నోకియా 8210 4జీ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ని మీరు రూ.3,999 కి కొనుగోలు చేయవచ్చు. డార్క్ బ్లూ, రెడ్ షేడ్స్ అనే రెండు రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ కాకుండా, నోకియా స్టోర్ నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ పై కంపెనీ, ఒక సంవత్సరం రీప్లేస్మెంట్ గ్యారంటీని ఇస్తోంది.

Nokia 8210 4G స్పెసిఫికేషన్స్

  • 4జీ కనెక్టివిటీ
  • ఎఫ్ఎమ్ రేడియో
  • 3.5 ఎంఎం ఆడియో జాక్
  • బ్లూటూత్ 5.0
  • మ్యూజిక్ ప్లేయర్
  • వీజీఏ కెమెరా

నోకియా 8210 4జీ ఫోన్లో 3.8 అంగుళాల డిస్ప్లే ను అందించారు. కలర్ఫుల్ క్యూవీజీఏ డిస్ప్లేను కంపెనీ ఉపయోగించింది. యూనిసాక్ టీ107 చిప్సెట్ పై ఫోన్ పని చేస్తుంది. అలాగే మీకు 128ఎంబి స్టోరేజీ, 48ఎంబి ర్యామ్ లభిస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 32జిబి వరకు మెమొరీని పెంచుకునే అవకాశముంది.

ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇందులో 30+ ఓఎస్ ను అందించారు. వీజీఏ రెజుల్యూషన్ కలిగిన 0.3 ఎంపి కెమెరాను ఈ ఫోన్లో అందించారు. ఎఫ్ఎం రేడియో, మ్యూజిక్ ప్లేయర్ కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. ఎఫ్ఎమ్ రేడియో వైర్ తో, వైర్ లేకుండా కూడా పని చేస్తుంది.

మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియా జాక్ ఈ ఫోన్లో ఉన్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వర్షన్ 5 ని అందించారు. ఇప్పుడు బ్యాటరీ వివరాలను తెలుసుకుందాం. ఈ ఫోన్లో 1,450 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 27 రోజుల స్టాండ్ బై ని కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్ బరువు కేవలం 107 గ్రాములు.

రబ్బర్ ఫినిషింగ్ తో ఉన్న ఆల్ఫా న్యూమరిక్ కీప్యాడ్ ని ఈ ఫోన్లో అందించారు. కీప్యాడ్ ఫోన్ కోసం చూసేవారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.