Reliance Jio, Airtel కి భారీగా పెరిగిన కస్టమర్లు – ట్రాయ్ రిపోర్ట్

Highlights

  • 2022 నవంబర్ లో 25 లక్షల మొబైల్ సబ్‌స్క్రైబర్లను పొందిన రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్
  • 18.3 లక్షల కస్టమర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా సంస్థ
  • తాజాగా జాబితాను వెలువరించిన టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా

దేశంలో టాప్ టెలీకామ్ సంస్థలుగా కొనసాగుతోన్న రిలయన్స్ జియో, ఎయిర్టెల్ సంస్థలు దాదాపుగా 25 లక్షల మంది మొబైల్ సబ్‌స్క్రైబర్లను పొందారు. ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతోన్న వొడాఫోన్ ఐడియా 18.3 లక్షల మంది కస్టమర్లను కోల్పోయి మరింత దిగజారింది.

టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం, రిలయన్స్ జియో సంస్థ 14.26 లక్షల కొత్త సబ్‌స్క్రైబర్లను నవంబర్ నెలలో పొందింది. మరోవైపు భారతి ఎయిర్టెల్ 10.56 లక్షల మంది యూజర్లను పొందింది.

2022 నవంబర్ మాసం ముగిసే నాటికి జియో మొబైల్ సబ్‌స్క్రైబర్స్ సంఖ్య 42.28 కోట్లుగా ఉంది. అంతకు ముందు నెలలో 42.13 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. జియోకి ఒక్కసారిగా యూజర్ బేస్ పెరిగిపోయింది.

భారతి ఎయిర్టెల్ సబ్‌స్క్రైబర్ బేస్ పెరగడంతో నవంబర్ నెలలో సదరు కంపెనీ యూజర్ల సంఖ్య 36.60 కోట్లకు పెరిగింది.

ఇప్పటికే ఆర్థిక కష్టాలతో కుదేలైపోయిన వొడాఫోన్ ఐడియా సంస్థ 18.27 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో నవంబర్ లో వొడాఫోన్ ఐడియా యూజర్ బేస్ 24.37 కోట్లకు చేరుకుంది.

ట్రాయ్ డేటా ప్రకారం, 2022 నవంబర్ చివరి నాటికి మొత్తం బ్రాడ్ బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు 82.53 కోట్లకు పెరిగారు. అంటే నెలవారీ వృద్ధి రేటు 0.47 శాతంగా నమోదైంది.

2022 నవంబర్ ముగిసే నాటికి మొత్తం 5 సర్వీస్ ప్రొవైడర్లు కలిసి 98 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.

ఈ జాబితాలో రిలయన్స్ జియో (43 కోట్లు), భారతి ఎయిర్టెల్ (23 కోట్లు), వొడాఫోన్ ఐడియా (12.3 కోట్లు) మరియు బీఎస్ఎన్ఎల్ (2.6 కోట్లు) ఉన్నాయి.

2022 నవంబర్ నెల నాటికి, టాప్ 5-వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లుగా రిలయన్స్ జియో (73.8 లక్షలు), భారతి ఎయిర్టెల్ (55.6 లక్షలు), బీఎస్ఎన్ఎల్ (40.2 లక్షలు), ఆట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ (21.4 లక్షలు), హ్యాత్‌వే కేబుల్ అండ్ డేటాకామ్ (11.3 లక్షలు) ఉన్నాయి.

టాప్-5 వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లుగా రిలయన్స్ జియో (42.28 కోట్లు), భారతి ఎయిర్టెల్ (22.5 కోట్లు), వొడాఫోన్ ఐడియా (12.34 కోట్లు), బీఎస్ఎన్ఎల్ (2.18 కోట్లు), ఇన్‌టెక్ ఆన్‌లైన్ (2.3 లక్షలు) ఉన్నాయి.

Airtel, Jio సంస్థలు ఇప్పటికే 5G సేవలను లాంచ్ చేశాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5జీ సేవలను విస్తరించే లక్ష్యంతో సదరు సంస్థలు పనిచేస్తున్నాయి.

మరోవైపు ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఇంకా 4జీ సేవలను దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకురాలేదు. పలు ప్రాంతాల్లో మాత్రమే బీఎస్ఎన్ఎల్ 4జీ అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో దేశం మొత్తం 4జీని విస్తరించే దిశగా బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది. అలాగే 5జీ సేవలను తీసుకొచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ సంస్థ టీసీఎస్ తో కలిసి పని చేస్తోంది. టీసీఎస్ సహకారంతో అతి త్వరలో దేశంలో 4జీ ని పూర్తిస్థాయిలో తీసుకురావడంతో పాటు, ఆ వెనువెంటనే 5జీ ని కూడా లాంచ్ చేయబోతోంది. ఇక వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం 4జీ సేవలను అందిస్తోంది. 5జీ నెట్వర్క్ లాంచ్ ఎప్పుడో ఇంకా తెలియదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.